BRS Mla: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే సోదరుడి ఇళ్లు, కార్యాలయాలు.. చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో రైడ్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో (telangana) 100 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఇటు తమిళనాడులో (tamilnadu) 150 టీమ్స్ రైడ్స్ చేస్తున్నాయి. డీఎంకే ఎంపీ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌పై (kcr) ప్రధాని మోడీ (modi) కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. ఆ వెంటనే ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో కంపెనీలు, అధినేతల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, సోదరులు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి.
అమీర్ పేట, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శంషాబాద్‌లో రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అమీర్ పేటలో గల ఎల్లారెడ్డిగూడల పూజకృష్ణ చిట్ ఫండ్ డైరెక్టర్లు సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజలక్ష్మీ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై దాడులు చేస్తున్నారు. జీవన్ శక్తి చిట్ ఫండ్, ఈకామ్ చిట్ ఫండ్‌తోపాటు 60 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. హౌసింగ్ బోర్డు 7వ ఫేజ్‌లో గల ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్‌మెంట్స్‌లో కూడా సోదాలు చేస్తున్నారు. చిట్ ఫండ్ యాజమాని అరికెపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. వ్యాపార వేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, ఎల్లారెడ్డిగూడలో వ్యాపారి మాగంటి వజ్రనాథ్, శంషాబాద్‌లో ఈ కామ్ సంస్థ నిర్వాహకుడు రఘువీర్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా రైడ్స్ చేస్తున్నారు. ఐదేళ్ల ఐటీ రిటర్న్‌లపై అనుమానం రావడంతో సోదాలు చేస్తున్నారు.
ఇటు తమిళనాడులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 70 ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. డీఎంకే ఎంపీ జగద్రక్షకన్ ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారు. చెన్నై, వేలూరు, కొయంబత్తూర్, అరక్కోణంలో గల ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి.