హైదరాబాద్‌లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి కల్తీపాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ఎస్వోటీ పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని కల్తీ పాలు చేసే వాళ్లను అరెస్ట్ చేశారు.
Adulterated Milk: పసిపిల్లలు తాగే పాల నుంచి అన్నింట్లో కల్తీ ఉంటుంది. హైదరాబాద్‌లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి కల్తీపాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ఎస్వోటీ పోలీసులు ఈరోజు కనుముక్కుల, గౌసుకొండ గ్రామాల్లో దాడులు చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి 350 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు ఏం కొత్త కాదు. గతంలో చాలాసార్లు పోలీసులు కల్తీ పాలను గుర్తించి.. తయారీదారులను అరెస్టు చేశారు. కానీ ఇప్పటికీ అదే తరహాలో కల్తీ జరుగుతుంది.
భువనగిరి, బొమ్మలరామారం, బీబీనగర్, భూదాన్ పోచంపల్లిలో ఎక్కువగా పాలు కల్తీ జరుగుతుంటాయి. ఇవి హైదరాబాద్‌కు చేరువలో ఉండటమే ప్రధానకారణం. హైదరాబాద్ సిటీకి ఈ జిల్లాలు దగ్గర కావడం వల్ల రవాణా పరంగా ఇబ్బందులు లేకపోవడం వల్ల ఇప్పటికీ పాలు కల్తీ చేస్తున్నారు. ఈ జిల్లాల్లో వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ కల్తీ పాలను హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. వీటిని హోటళ్లు, గృహ సముదాయలకు సరఫరా చేస్తుంటారు.
ఈ కల్తీ పాల వల్ల చిన్నపిల్లలతో పాటు పెద్ద వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిలో కలిపే యూరియా, కెమికల్స్, వంటనూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైడ్రోజన్ ఫెరాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, సుక్రోజ్, నూనె, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా, యూరియా, పాల పొడిలాంటి రసాయన పదార్థాలను వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలను ఎక్కువగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.