Viral news: హైదరాబాద్ హోటల్ వంటకంలో బొద్దింక..బాధితుడి ఫిర్యాదు
వీకెండ్స్‌లో ఫ్యామిలీతో రెస్టారెంట్స్‌కు వెళ్లాలన్నా, ఏదైనా తినాలని హోటల్స్ వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం శుభ్రత పాటించని హోటళ్లు విచ్చలవిడిగా ఉండటమే. ఆహారంలో నాణ్యత లేక తిన్నవారు ఆనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
Viral news: ఆకలేసినా లేదా సరదాగా కుటుంబ సభ్యులతో తిందామని హోటల్లకు, రెస్టారెంట్లకు వెళ్తే వడ్డించిన వాటిలో బల్లులు, బొద్దింకలు, దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితం సికింద్రాబాద్(Secunderabad)లోని ఓ హోటల్లో మటన్ కీమా తిన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మరో పెద్ద హోటల్ బిర్యానీలో బల్లి వచ్చి కస్టమర్లను బెంబేలెత్తించింది.
తాజాగా శనివారం గచ్చిబౌలి(Gachibowli ) వినాయక్‌నగర్‌లోని ఓ హోటల్లో పప్పులో ఉడికిన బొద్దింక దర్శనం ఇచ్చింది. దీనిపై ముదావత్ శ్రీనివాస్ అనే యువకుడు దాల్ మకాని తింటుండగా బొద్దింక వచ్చిందంటూ జీహెచ్ఎంసీ(GHMC)కి ఫిర్యాదు చేశాడు. ముందు అతను ప్రశ్నించగా హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, వంట గది చెత్తగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి ప్రతీరోజు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారుల చేతులు తడవగానే అక్కడితో సమస్యకు చమరగీతం పాడుతున్నారని నగర పౌరులు విమర్శిస్తున్నారు.
గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగంలో కాళీలు ఉన్నాయని, సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు చేయలేకపోతున్నట్లు అధికారులు చెప్పేవారు. ఇప్పుడు సుమారు 23 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నా కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. తనిఖీలు, చర్యలు అంతంతమాత్రంగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. దీంతో హోటల్ నిర్వాహకులు యథేచ్ఛగా నిషేధిత రంగులను వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. కల్తీ మసాలాలు, దినుసులతో బిర్యానీలు, కూరలు వండుతూనే ఉన్నారు. చౌక నూనెతో ప్రజారోగ్యానికి పాతరేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా పూర్తిగా శ్రద్ధ పెట్టాలని నగర పౌరులు కోరుతున్నారు.