కాంగ్రెస్ నేతలకు, టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని, గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వండని కోరారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందన్న ఆయన అనుబంధ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
ఇక వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న రేవంత్ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? చేప పిల్లల పంపిణీని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని ఆయన ప్రశ్నించారు.
నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి కొందరు పెద్దలు దోచుకుంటున్నారని, వీటిపై ప్రభుత్వం విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు అందించినట్లే మత్య్సకారులకు కూడా 5లక్షల బీమా పథకం అమలు చేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్య్సకారులను బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చేలా కృషి చేస్తామని అన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై సూచనలు ఇస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని, మత్స్యకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు.