మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యిందని గుర్తు చేశారు.
పేదోడి పొట్టగొట్టి….మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమేంటని రాసుకొచ్చారు. సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి…ఇప్పుడు 3 సిలిండర్ల జపం చేస్తరా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలకు కాసుల పంట కురుస్తుండగా… కామన్ మ్యాన్ గుండెల్లో మాత్రం గ్యాస్ మంట కొనసాగుతుందని అభిప్రాయం వక్తం చేశారు. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప… ఆడబిడ్డల కష్టాలు కనిపించవా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శించారు.