CM KCR ముచ్చటగా మూడోసారి.. ఈ సారి సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందా..?
తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. అందుకోసం ఎప్పటిలానే సెంటిమెంట్ ప్లేస్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు.
CM KCR: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) సెంటిమెంట్లు ఎక్కువ. రోజు, వారం, తిథి, నక్షత్రం చూసుకొని మంచి పనిని ప్రారంభిస్తారు. అలాగే ఏ చోట నుంచి ప్రచారం, పోటీ లాంటి పట్టింపులు కూడా ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరసగా రెండుసార్లు ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని ఊబలాటపడుతోంది. అందుకోసం తన సెంటిమెంట్‌తో ప్రచార బరిలోకి దిగుతున్నారు గులాబీ బాస్.
హుస్నాబాద్ నుంచే ఎందుకు..?
గత కొన్నిరోజుల నుంచి సీఎం కేసీఆర్ కనిపించడం లేదు. అనారోగ్య సమస్యలతో మీడియాకు మొహం చాటేశారు. ఓ సారి జ్వరం అంటారు.. మరోసారి ఛాతీలో ఇన్ ఫెక్షన్ అనే వార్తలు వచ్చాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ మరికొద్దీరోజుల్లో పులి బయటకు వస్తోందని హింట్ ఇచ్చారు. తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావడం.. కేసీఆర్ ప్రచారం షెడ్యూల్ రావడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల ప్రచారంపై కేసీఆర్‌కు సెంటిమెంట్ ఉంది. దాని ప్రకారం ఈ సారి కూడా హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరిస్తున్నారు.
రెండుసార్లు విక్టరీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి ప్రారంభించారు. 2014లో ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ 63 చోట్ల విజయం సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్ సీఎం పదవీ చేపట్టి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆ అసెంబ్లీ పూర్తి కాలం గడవకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కాస్త వ్యతిరేకత కనిపించింది. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జట్టుకట్టడం మైనస్ అయ్యింది. దానిని కేసీఆర్ క్యాష్ చేసుకున్నారు. 2018లో కూడా హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభించారు. అప్పుడు సీట్లు పెరిగాయి. 63 నుంచి 88 సీట్లకు చేరుకున్నాయి. దీంతో కేసీఆర్‌కు హుస్నాబాద్ అంటే సెంటిమెంట్ అయ్యింది.
సెంచరీ కొడతాం
ఇప్పుడు మూడోసారి ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. గతంలో కంటే సీట్లు పెరుగుతాయని.. ఇక సెంచరీ కొడతామని అంటున్నారు. అందుకోసమే ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల సమర శంఖం మోగించబోతున్నారు. ఈ సారి కూడా తన సెంటిమెంట్ పనిచేస్తుందని ధీమాతో ఉన్నారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని విశ్వసిస్తున్నారు.
నిరుద్యోగులు, కౌలు రైతులు
వాస్తవానికి పార్టీపై, ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురుకానుంది. కౌలు రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారు. దానిని గులాబీ బాస్ కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలీ. ఆ పార్టీకి ఒక్కటే ప్లస్.. ఈ సారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం అని పొలిటికల్ ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు.