Harish ఆరడుగుల బుల్లెట్.. సిద్దిపేట అభివృద్ధి ప్రదాత, మేనల్లుడిపై కేసీఆర్ ప్రశంసలు
మేనల్లుడు హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం అయినా సరే సిద్దిపేటలో తప్పకుండా అమలు కావాల్సిందేనని స్పష్టంచేశారు.
CM KCR Praise Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ పార్టీ దూసుకెళుతోంది. రోజు రెండు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. నిన్న కుమారుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, తర్వాత అల్లుడు నియోజకవర్గం సిద్దిపేటలో పాల్గొని ప్రసంగించారు. సిరిసిల్లలో కుమారుడు కేటీఆర్.. సిద్దిపేటలో అల్లుడి హరీశ్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.
హరీశ్ రావు ( Harish Rao) గురించి కేసీఆర్ ఓ జోక్ చెప్పారు. హరీశ్.. ఆడ, ఈడ తిరుగుతాడు.. ఎక్కడన్నా తట్టెడు పేడ కనిపిస్తే చాలు.. తీసుకెళ్లి సిద్దిపేటలో వేస్తాడు.. తన నియోజకవర్గంపై హరీశ్క అంత ప్రేమ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం. కార్యక్రమం సిద్దిపేటలో తప్పకుండా రావాల్సిందేనని పట్టుబడతానని గుర్తుచేశారు.
రాష్ట్రంలో సిద్దిపేటకు ప్రత్యేక స్థానం ఉంది అంటే దాని వెనక హరీశ్ రావు ( Harish Rao) కృషి ఉందన్నారు. సిద్దిపేట నుంచి తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ఇంత అభివృద్ధి చేసేవాడిని కాదేమోనని అన్నారు. ఈ సారి కూడా హరీశ్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో తాను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించానని.. ఢిల్లీలో బాణీ వినిపించాల్సి వచ్చిందని.. అందుకే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందానని గుర్తుచేశారు.
అప్పుడు సిద్దిపేటకు బై పోల్ రాగా.. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్ రావును ఇక్కడి ప్రజలకు అప్పగించానని వివరించారు. తాను ఊహించిన దాని కన్నా ఎక్కువగా హరీశ్ రావు పనిచేశారని పేర్కొన్నారు. తనకన్నా ఎక్కువగా డెవలప్ చేశాడని.. ఏ పథకం వచ్చినా సరే.. ఇక్కడ అమలు కావాల్సిందేనని తెలిపారు. సిద్దిపేట నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు సీఎం కేసీఆర్. మార్గమధ్యలో హరీశ్ రావు, ఇతర నేతలతో కలిసి రోడ్డు పక్కన టీ తాగారు.