BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కదనరంగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr) దిగారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు అభ్యర్థులకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో వివరించారు. ఆసిఫాబాద్‌లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన కోవా లక్ష్మీకి టికెట్ ఇచ్చామని.. ఆత్రం సక్కు సేవలను భవిష్యత్‌లో ఉపయోగించుకుంటామని తెలిపారు. వేములవాడలో అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌కు (ramesh) గెలుపు అవకాశాలు ఉన్నాయని.. కానీ టెక్నికల్‌గా బాగోలేకపోవడంతో మార్చామని తెలిపారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సామరస్య పూర్వకంగా జరిగిందని కేసీఆర్ (kcr) వివరించారు. టికెట్ రానీ నేతలు సంయమనంగా ఉండాలని.. భవిష్యత్‌లో అవకాశాలు వస్తాయని హామీనిచ్చారు. వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. అహంకారం వల్లే జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో ఓడిపోయారని.. ఇతర నాయకులతో కూడా మాట్లాడలేదని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్, వనమా వెంకటేశ్వరరావు తదితరులపై కేసుల గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓడిపోయిన వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నారని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నిన్నటి వరకు రోజులు బాగాలేవని కేసీఆర్ వివరించారు. పితృ పక్షం ఉండటంతో ఏ పని చేయలేదని చెప్పారు. తనకు తెలిసిన అయ్య వారు చెక్కు మీద కూడా సంతకం పెట్టొద్దని చెప్పారని.. అందుకే ఈ రోజు వరకు ఆగామని వివరించారు. పొద్దున 51 మంది అభ్యర్థుల బీ ఫామ్‌పై సంతకం చేశానని పేర్కొన్నారు. మిగిలిన వారికి రేపు బీ ఫామ్స్ అందజేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వ్యవహారాలను అడ్వకేట్ భరత్ తీసుకుంటారని.. ఆయనతోపాటు 20 మంది న్యాయవాదులు ఉన్నారని వివరించారు. అభ్యర్థులు వారిని సంప్రదించాలని మొబైల్ నంబర్ చెప్పారు. పార్టీ- ఈసీ మధ్య భరత్ వారధిగా ప్రవర్తించారని తెలిపారు. అప్ డేట్ ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరుతో అభ్యర్థులు బీ ఫామ్ నింపాలని.. నామినేషన్ వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలని మరీ మరీ చెప్పారు.