A couple attempted suicide in front of Pragati Bhavan as they did not get a double bedroom
TelanganaElections2023: డబుల్ బెడ్రూమ్(double bedroom) ఇల్లు రాలేదని బాధతో దంపతులు ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేందర్ (40) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చెందిన మహేందర్ కొంతకాలం క్రితం డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు ఇల్లు మంజూరైనట్లు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబం అంతా సంతోషపడ్డారు. తర్వాత ఏ అధికారి దగ్గరకు వెళ్లినా ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్, తన భార్యతో కలిసి ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించిన భద్రతా సిబ్బంది వారిని కాపాడారు. ఈ ఘటన అక్కడే ఉన్న కొంతమంది తమ సెల్ ఫోన్లలో బందించారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో దీనిపై పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు స్పందించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
తెలంగాణలోని ప్రతి పల్లెలో గత రెండు నెలల క్రితం గృహలక్ష్మీ(Gruhalakshmi) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొంత మందికి ఇల్లు వచ్చాయని లబ్దిదారులకు గృహలక్ష్మీ(Gruhalakshmi) పత్రాలను అందించారు. అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అందులో భాగంగానే దళితబంధు, గృహలక్ష్మీ, బీసీ బంధులాంటివి కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డట్లు ప్రభుత్వం తెలిపింది.