టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ పోరులో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన ఫైనల్ చేరింది. సౌతాఫ్రికా జట్టుతో తుదిపోరులో తలపడనుంది. ఇంతకీ సెమీస్ ఫైట్‌లో భారత విజయానికి ఎవరు దోహదపడ్డారు? ఇంగ్లండ్ జట్టు దారుణంగా ఆడిందా? భారత జట్టు అద్భుతంగా ఆడిందా? ఇంగ్లండ్ జట్టుపై విజయానికి భారత బ్యాటర్లు కారణమా, బౌలర్లు కారణమా? క్రికెట్ విశ్లేషకులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.
T20 World Cup: టీమిండియా సారధి రోహిత్ శర్మ .. కీలక సమయంలో ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు కలిసి వచ్చింది. కేవలం 39 బంతుల్లోనే 57 పరుగులు చేసి భారత జట్టుకు గట్టి పునాది వేశాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లు ఔటైనప్పటికీ.. బ్యాలెన్స్ కోల్పోకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఎంతో సమర్ధంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. భారత విజయంలో రెండో కీలక వ్యక్తిగా నిలిచాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేసి తన సత్తా చాటాడు. వీరిద్దరితో పాటు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కూడా బ్యాట్ ఝుళిపించారు. హార్ధిక్ పాండ్యా 23 పరుగులు చేసి ఔటవ్వగా.. జడేజా 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరు నలుగురు బ్యాటింగ్ ప్రతిభ కారణంగా భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ ముందు 172 పరుగుల టార్గెట్ ఉంచింది.
172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 103 పరుగులకే చతికిల పడింది. భారత బౌలర్ల ధాటిని తట్టుకోలేక చతికిలపడ్డారు. నాల్గవ ఓవర్ నుంచే వికెట్ల పతనం మొదలయింది. అక్షర్ పటేల్ వికెట్ల వేటను ఆరంభించాడు. 23 పరుగుల వద్ద జోస్ బట్లర్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్‌ను బుమ్రా దక్కించుకున్నాడు. ఫిల్ సాల్ట్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ విజృంభించాడు. మోయిన్ ఆలీ, జానీ బెయిర్ స్టో వికెట్లను పడగొట్టాడు. 26 పరుగుల వద్ద వికెట్ కోల్పోకుండా ఉన్న ఇంగ్లండ్ జట్టు 46 పరుగులకు చేరే సమయానికి 4 వికెట్లు కోల్పోయింది. ఆ నాలుగు వికెట్లలో మూడు వికెట్లు అక్షర్ పటేల్ దక్కించుకున్నాడు.
అక్షర్ పటేల్ దాడి నుంచి పూర్తిగా తేరుకోకముందే కులదీప్ యాదవ్ వీర విహారం చేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. సామ్ కమన్, హారీ బ్రూక్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్ స్టన్ వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదిల్ రషీద్‌ను సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేశాడు. ఆ సమయంలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. 21 పరుగుల వద్ద ఉన్న జోఫ్రా ఆర్చర్ వికెట్‌ను బుమ్రా పడగొట్టడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 68 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. సగర్వంగా ఫైనల్ చేరింది. భారత విజయంలో బౌలర్లే కీలకంగా నిలిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్‌లు అదరహో అనిపించారు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.