టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ వరకు చేరుకున్నా… కప్ మాత్రం చేజారింది. కప్పు చేజారడంతో… ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేయగా… అతని ట్వీట్ కి.. టీమిండియా క్రికెటర్ షమీ కౌంటర్ వేయడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే…. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. బ్రొకెన్ హాట్ ఎమోజీని షోయబ్ ట్వీట్ చేస్తూ పాక్ ఓటమితో గుండె బద్దలైందన్నట్లుగా తన బాధను వ్యక్తం చేశాడు. దీనిపై భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అక్తర్ చేసిన ట్వీట్‌పై కామెంట్ చేస్తూ… సారీ బ్రదర్, దీన్నే కర్మ అంటారని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతకు ముందు సెమీ ఫైనల్-2లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.
ఈ క్రమంలో టీమ్ ఇండియా ఆటతీరును హేళన చేస్తూ పాక్ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేశారు. ఫైనల్లో భారత్‌తో తలపడాలని పాక్ ఎదురుచూసిందన్నారు. ఇప్పుడు అది సాధ్యం కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు. టీమిండియాకు ఇది అత్యంత దారుణమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఈ ఓటమికి వారు అర్హులేనని, ఫైనల్‌కు చేరే అర్హత వారికి లేదని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీంతో దానికి షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షమీ కౌంటర్ సూపర్ అంటూ… ఇండియన్స్ ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.