ఐపీఎల్ టోర్నీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పటిష్టమైన రాజస్థాన్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ టీం విజయం సొంతం చేసుకుంది.
IPL 2024: SRH బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్ చివరి బంతికి వికెట్ తీయడం ద్వారా తన జట్టుకు విజయం అందించాడు. భువనేశ్వర్ తో పాటు పాట్ కమిన్స్, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ జట్టుకు పరాజయం రుచి చూపించారు. జోస్ బట్లర్, సంజు శాంసన్ లను డకౌట్ చేసిన భువనేశ్వర్ కుమార్ ఆ జట్టును చావు దెబ్బ తీశాడు. రాజస్థాన్ జట్టు అక్కడి నుంచి కోలుకోలేకపోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 67 పరుగులు, రియాన్ పరాగ్ 77 పరుగులు, రోమన్ పావెల్ 27 పరుగులు చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివర్లో ధ్రువ్ జురెల్ వికెట్ ను.. ప్యాట్ కమిన్స్ తీయడంతో సన్ రైజర్స్ విజయావకాశాలు మెరుగయ్యాయి. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో .. రాజస్థాన్ జట్టు 11 పరుగులు చేసింది. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం అందుకోవలసి సమయంలో భువనేశ్వర్ కుమార్ తెలివిగా బౌలింగ్ చేసి.. వికెట్ తీశాడు. అప్పటి వరకు మంది ఫాంలో ఉన్న రోమెన్ పావెల్ ఔట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు విజయం సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ చెలరేగి ఆడడంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 58 పరుగులు చేయగా…నితీశ్ కుమార్ రెడ్డి 76 పరుగులు, క్లాసెన్ 42 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన SRH 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయింది. రాజస్థాన్ జట్టుకు ఈ టోర్నీలో ఇది రెండో పరాజయం కావడం విశేషం. టోర్నీ ఆరంభంలో గుజరాత్ చేతిలో మొట్ట మొదటిసారిగా పరాజయం పాలైన రాజస్థాన్ జట్టు..అక్కడి నుంచి అపజయమే లేకుండా విజయపరంపర కొనసాగించింది. మళ్లీ హైదరాబాద్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన సంజు సేన..కేవలం రెండే మ్యాచుల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.