ఐపీఎల్ (Indian Premier League -IPL)లో ఆటగాళ్లు సహనం కోల్పోతున్నారు. ఆటలో దురుసు ప్రవర్తనకు పాల్పడుతున్నారు. ఫలితంగా తీవ్ర విమర్శలు పొందుతున్నారు. విమర్శలతో పాటు భారీ జరిమానాలు బహుమానంగా పొందుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians -MI), కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders -KKR) మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి పరిణామమే జరిగింది. కోల్ కత్తా కెప్టెన్ నితీశ్ రానా (Nitish Rana) ప్రత్యర్థిపై దూషించడంతో వాగ్వాదం జరిగింది. దీని ఫలితంగా నితీశ్ రానాతోపాటు ప్రత్యర్థికి జరిమానా పడింది. దీంతోపాటు స్లో ఓవర్ రేటు కారణంగా ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు కూడా జరిమానా పడింది.
ముంబైలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా తొలుత బ్యాటింగ్ కు దిగి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ నితీశ్ రానా (5) తొమ్మిదో ఓవర్ లో తొలి బంతికి ఔటయ్యాడు. రమణ్ దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తనను ఔట్ చేసిన బౌలర్ షోకీన్ (Shokeen)పై నితీశ్ అరిచాడు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో షోకీన్ పై దాడి చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ముంబై ఆటగాళ్లు నిలువరించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. దీనిపై రిఫరీ ఫిర్యాదు మేరకు రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత ప్రకటించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.21 కింద లెవల్ 1 నేరానికి పాల్పడడంతో ఐపీఎల్ నిర్వాహకులు పై చర్య తీసుకున్నారు. ఇక షోకీన్ కు కూడా జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 కింద 10 శాతం జరిమానా పడింది.
ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు రిఫరీ జరిమానా విధించారు. ఓవర్లు సమయానికి తగ్గట్టు వేయకపోవడంతో సూర్యకు రూ.12 లక్షలు జరిమానా వేశారు. కాగా ఈ మ్యాచ్ లో కోల్ కత్తా విధించిన లక్ష్యాన్ని ముంబై 17.4 ఓవర్లలోనే 186 పరుగులు చేసి విజయం సాధించింది.