ఈ ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక జట్టుపై మరో జట్టు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. తాజాగా శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కష్టపడి 181 పరుగులు చేసింది. ఇదేమీ మరీ తక్కువ స్కోర్ కాదు. కానీ, ఆ స్కోర్ ని కూడా ఢిల్లీ చాలా సునాయాసంగా అది కూడా 16.4 ఓవర్లలోనే చేధించడం గమనార్హం. ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 23 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడించగా.. ఢిల్లీ ఆ ఓటమికి ఈరోజు బదులు తీర్చుకుంది.
మొదట ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) (46 బంతుల్లో 55: 5×4), మహిపాల్ లూమర్ (29 బంతుల్లో 54 నాటౌట్: 6×4, 3×6) అర్ధ శతకాలు బాదేశారు. డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 82 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఆ తర్వాతి బంతికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Maxwell) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 46 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 సీజన్లో ఆరో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అదే ఓవర్లో ఫోర్ బాదిన మహిపాల్ లోమ్రోర్, 26 బంతుల్లో ఐపీఎల్ కెరీర్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. వస్తూనే సిక్సర్ బాదిన అనుజ్ రావత్ 3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేయగా మహిపాల్ లోమ్రోర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
182 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) తక్కువ స్కోరుకే ఔటైపోయినా మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (Philip Salt) (87: 45 బంతుల్లో 8×4, 6×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడేశాడు. వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కి 5.1 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సాల్ట్.. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌తో (Mitchell Marsh) కలిసి రెండో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 119 వద్ద మార్ష్ ఔటైనా కూడా సాల్ట్ మాత్రం జోరు తగ్గించలేదు. మధ్యలో అతనికి రిలీ రొసౌ (35 నాటౌట్: 22 బంతుల్లో 1×4, 3×6) నుంచి చక్కటి సపోర్ట్ లభించింది. అంతే లక్ష్య చేధనకు ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే, ఢిల్లీ విజయం సాధించింది.