టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో దూసుకెళ్తున్నాడు. ఆసియా కప్ (Asia Cup) 2023లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మంచి ప్రదర్శననే చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డేల్లో తన కెరీర్ బెస్ట్ ర్యాంకు ను అందుకున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ దిశగా మరో ముందడుగు వేశాడు. కెరీర్ లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన జాబితాలో అతను మూడు నుంచి ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్10లో చోటు సాధించారు.
ఆసియా కప్‌లో వరుసగా మూడు అర్ధ శతకాలు సాధించిన రోహిత్ శర్మ (Rohit Sharma) పది నుంచి తొమ్మిదో ర్యాంక్ కు చేరుకున్నాడు.దాయాది పాక్ పై అద్భుత సెంచరీ చేసిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, వరుసగా అర్థశతకాలతో రాణిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మలు చెరో రెండు స్థానాలు మెరుగుపరచుకున్నారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎనిమిదో ర్యాంకులో రోహిత్ శర్మ తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 863 రేటింగ్ పాయింట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. 759 రేటింగ్ పాయింట్లతో గిల్ రెండో స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డర్ డస్సెన్ 745 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత వరుసగా డేవిడ్ వార్నర్ (David Warner) (739), ఇమామ్ ఉల్ హక్ (735) లు ఉన్నారు.