ENG Vs PAK: నేటి ఇంగ్లాండ్ మ్యాచులో పాక్ సెమీస్ చేరాలంటే ఇన్ని పరుగులు చేయాలా?
ICC వన్డే ప్రపంచకప్ 2023లో ఈరోజు కీలకమైన మ్యాచ్ ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. ఇది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపట్లో మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో పాక్ జట్టు గెలిచి సెమీస్ చేరాలంటే అద్భుతమైన పరుగులు చేసి విజయం సాధించాల్సిందే.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023(icc odi world cup 2023)లో నేడు 44వ మ్యాచ్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో తప్పక మంచి స్కోరుతో గెలవాల్సిందే. మరోవైపు ఇంగ్లాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటోంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనుకుంటోంది.
వాస్తవానికి న్యూజిలాండ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో గెలిచింది. దీని కారణంగా కివీస్ జట్టు పాకిస్తాన్ కంటే ముందుంది. న్యూజిలాండ్ 23 ఓవర్లలో మ్యాచ్ గెలిచింది. దాని కారణంగా వారి నెట్ రన్ రేట్ కూడా పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ కంటే పాకిస్థాన్ ముందంజలో ఉండాలంటే మెరుగైన రన్ రేటుతో అద్భుత విజయం సాధించాలి. అంటే బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించాలి లేదా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 284 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ను ఓటమిపాలు చేయాలి. అయితే ఇది చాలా కష్టమే అయినప్పటికీ మరి పాక్ జట్టు ఈ మ్యాచులో విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.
అయితే గతంలో ఇరు జట్ల మధ్య కేవలం 91 వన్డే మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇందులో 56 మ్యాచ్‌లు ఇంగ్లాండ్ గెలుపొందగా, పాకిస్తాన్ 32 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు ఆడినా ఫలితం లేదు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య 10 మ్యాచ్‌లు జరగగా అందులో ఇంగ్లాండ్ 4 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈడెన్ గార్డాన్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక్కడి పిచ్‌పై బ్యాట్స్‌మెన్ చాలా పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ ఈసారి ఈ పిచ్‌పై స్పిన్నర్లు కూడా అద్భుతాలు చేయవచ్చు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ జడేజా 5 వికెట్లు తీశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్మెన్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 38 వన్డే మ్యాచ్‌లు జరగ్గా అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 22 మ్యాచ్‌లు గెలుపొందగా, 15 సార్లు ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటుంది.
పాకిస్థాన్ జట్టులో ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, ఉసామా మీర్/హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హారిస్ రవూఫ్ ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్.