Mizoram Election Result 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో విక్టరీ కొట్టిన జెడ్పీఎం
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఘన విజయం సాధించింది. ఈసారి అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.
Mizoram Election Result 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఘన విజయం సాధించింది. ఈసారి అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 40 స్థానాలున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పిఎం) 27 సీట్లను గెలుచుకుంది. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 10 సీట్లు గెలుచుకుంది. బీజేపీ అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అయింది. మరోవైపు ఈ ఎన్నికల్లో మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటమి పాలయ్యారు. దీంతో… రాజ్ భవన్ లో గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను అందించారు.
మిజోరంలో విజయం సాధించిన ‘జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్’ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం కానున్నట్టు పార్టీ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. సప్దంగ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్టు జెడ్పీఎం నేత లాల్ దుహోమా తెలిపారు. లాల్దుహోమా సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప ఎంఎన్ జే అభ్యర్థిపై దాదాపు 3 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. మిజోరంలో ప్రస్తుతం లల్దుహోమ పేరు మార్మోగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి లాల్ దుహోమా ఒకప్పుడు ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఆమె స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆయనపై రెండుసార్లు అనర్హత వేటు పడింది. 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయాన్ని తుంగలో తొక్కి మిజోరంలో జేపీఎం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయన మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.