తెలంగాణలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై డిసెంబర్ లోపే నోటిఫికేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరు పోటీ చేయనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రసవత్తర పోరు
భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే పదవి కోసం ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగనుంది. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి BRS తరఫున పోటీ చేసేందుకు ఈసారి ఛాన్స్ వచ్చే అవకాశం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీలో చేరారు. కానీ నియోజకవర్గంలో మాత్రం పెద్దగా అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో ఎన్నికైన మధుసూదనాచారి చేసిన పనులు మాత్రమే కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.
చారికి మరోసారి?
ఈ క్రమంలో BRS పార్టీ నుంచి సీనియర్ నేత, కేసీఆర్ కు ఆప్తుడైన మధుసూదనాచారికి కేసీఆర్ మరోసారి అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే మధుసుధనాచారి కుమారుల అవినీతి ధోరణి వల్లనే 2018లో చారి ఓడిపోయారని ఇంకొంత మంది చెబుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత కొంత కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న చారి… మళ్లీ కేసీఆర్ ఆదేశాల మేరకు మళ్లీ జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
పోటీలోకి గండ్ర సత్యనారాయణ రావు
మరోవైపు 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గండ్ర సత్యనారాయణ రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఓడిన సత్యనారాయణ రావు ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండ సురేఖ భర్త కొండా మురళీ కూడా ఈ నియోజకవర్గం సీటు కోసం దృష్టి పెట్టినట్లు సమాచారం.
కీర్తి రెడ్డికి మళ్లీ ఛాన్స్?
ఇక బీజేపీ తరఫున 2018లో పోటీ చేసి ఓడిన చందుపట్ల కీర్తి రెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అనేది తేలియాల్సి ఉంది. కానీ తాను మాత్రం మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి రాజకీయాలు వారే చేస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని కీర్తి రెడ్డి అంటున్నారు. అనేక చోట్ల నేతలు భూకబ్జాలు చేశారని ఆరోపిస్తున్నారు. వీరి బారినుంచి తప్పించుకోవాలంటే ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
కుంటుపడ్డ అభివృద్ధి!
ఇక భూపాలపల్లి నియోజక వర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరుగలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవని, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దళిత బంధు స్కీం కూడా అమలు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అంటున్నారు. అన్ని రకాల ప్రభుత్వ భవనాలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. భూపాలపల్లి కేంద్రంలో ఇసుక లారీల సమస్యతోపాటు ఓపెన్ కాస్ట్ గనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ఓటర్లే కీలకం?
తెలంగాణ ఏర్పాటైన తర్వాత భూపాలపల్లి నియోజక వర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో BRS నుంచి మధుసుదనాచారి గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గండ్ర వెంకటరమణా రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణా రెడ్డి గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ రావు సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. మధుసుదనాచారి మూడో స్థానానికి చేరారు. ఇక 2023లో ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో 2022 డిసెంబర్ నాటికి మొత్తం 2 లక్షల 56 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 28 వేల 746 మంది పురుషులు ఉండగా, లక్షా 27 వేల 601 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు.. అభ్యర్థుల గెలుపునకు కీలకం కానున్నాయి.