Heavy Rainfall: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ మొదలైన ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల తర్వాత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వేర్వేరు ప్రమాదాల్లో కనీసం 22 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 8 నుండి ఈ ప్రాంతంలో మరణాల సంఖ్య 91కి చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల తరువాత భారీ నష్టం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. గంగా, రావి, స్వాన్, చీనాబ్, బియాస్, సట్లెజ్ సహా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహానికి చాలా చోట్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి.
హిమాచల్‌లోని మండి, ఉనా, మనాలి, కులు, కిన్నౌర్, చంబా వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో కనీసం ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి. గంగా నదితో సహా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల ఇళ్లు, వాహనాలు వాటి బలమైన ప్రవాహాల పట్టులోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో కనీసం ఐదుగురు మృతి చెందారు.
దీంతో పాటు పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు రావడంతో వాహనాలు, ఇళ్లు తదితరాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా భారీ వర్షాల తరువాత చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హథినికుండ్ బ్యారేజీలో హర్యానా భారీగా నీటిని విడుదల చేయడంతో ఢిల్లీకి కూడా వరద ముప్పు ఏర్పడింది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి.. అయితే రానున్న రెండు రోజుల్లో ఈ సమస్య మరింత పెరగనుంది.
ఉత్తర భారతంతోపాటు పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిపుణులు ఈ పరిస్థితికి సంబంధించి రెండు సమస్యలపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కొండ ప్రాంతాల సమస్య వేరు, ఢిల్లీ వంటి మైదాన ప్రాంతాల్లోని నగరాల సమస్య వేరు. కొండ ప్రాంతాల్లో టూరిజం పెంపు, చెట్ల నరికివేత, రోడ్ల నిర్మాణం వంటి సమస్యల పునరుద్ధరణకు చర్యలు మొదలుపెట్టారు.