SRD: సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ బహుమతి శుక్రవారం తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా మైనార్టీ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 60 సీట్లు మైనార్టీలకు, 20 సీటు నాన్ మైనార్టీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
AP: మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకూ LRS, BPSల కింద వచ్చిన ఆదాయంలో వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. LRS కింద గ్రామాల్లో వచ్చే ఆదాయంలో పంచాయతీలకు 50%, పట్టణాభివృద్ధి, ప్రణాళికా విభాగాలకు 50% ఇవ్వనున్నారు. BPS కింద గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయంలో పంచాయతీలకు 70% ఇస్తారు.
SRPT: మునగాల మండలం గణపవరం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు వేదికపై కూర్చోగా.. కోదాడ ఆర్డివో సూర్యనారాయణకు మాత్రం కుర్చీ లేక వారి వెనక నిలబడాల్సి వచ్చింది. నాయకుల తీరుపై రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మక్తల్లో ‘అరైవ్-అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్లు ఆరోగ్యంపై ముఖ్యంగా కంటి చూపుపై శ్రద్ధ వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని ఎస్ఐ సూచించారు. భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు.
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. మొత్తం 14 మంది బాధితులకు రూ. 6,49,171 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రకృతి రమణీయత భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించిన భానుడి తొలి కిరణాలు ఆలయ రాజగోపురం, శిఖరంపై పడి బంగారు వర్ణంలో ధగధగలాడాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు తమ చరవాణుల్లో ఈ సుందర దృశ్యాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
BHNG: మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామ సమీప ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ సర్పం రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు, స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామ సమీపంలోని శివాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో నంది కోళ్ల సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్టుకుంది. గుంత రంగయ్య శెట్టి, రఘు యాదవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని స్వామివారికి సేవలు అందించారు.
దానిమ్మ పండు పోషకాల గని. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం డిటాక్స్ అవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది.
AP: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. 2019లో 29వ ర్యాంకులో ఉంటే 2023లో 76కి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు 41వ ర్యాంకుకు తీసుకొచ్చామని వెల్లడించారు. టాప్ 10 యూనివర్సిటీగా తీసుకురావాలన్నదే లక్ష్యమని చెప్పారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ VII-సెమిస్టర్ రెగ్యులర్,బ్యాక్ లాగ్ ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 69.39% ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ,చంద్ర కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని సయ్యద్ సాదిక్ కు చెందిన కారు మెకానిక్ గ్యారేజ్ నుంచి చోరీలకు పాల్పడిన ఇరువురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. దుబ్బాకకు చెందిన తూర్పాటి సంజయ్ (25), పర్వతం రాజయ్య (27) గురువారం తెల్లవారుజామున విలువైన కేబుల్స్ చోరీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు.
అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ‘షెల్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2040ల్లో అమెరికాను, 2060ల్లో చైనాను ఇంధన గిరాకీలో భారత్ అధిగమించగలదని అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో సహజ వాయువు, LNG కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. వీటి గిరాకీ 50% లేదా అంతకంటే ఎక్కువ పెరగొచ్చని పేర్కొంది.
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, వికలాంగుల కాలనీల్లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఒక మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై సైబర్ క్రైమ్స్, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.