ATP: గుత్తిలోని లక్ష్మీ వైన్ షాప్ వద్ద అధిక మద్యం సేవించి వీరాంజనేయులు అనే వ్యక్తి శుక్రవారం అపస్మారక స్థితిలో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వీరాంజనేయులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా: డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం సులువు, ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ప్రీ మాన్‌సూన్ డ్రై సీడింగ్ విధానంలో 30–32 రకాల మిశ్రమ విత్తనాలను డ్రోన్‌తో చల్లవచ్చని, సమయం ఆదా, కూలీల కొరత తగ్గుతుందని చెప్పారు.
అన్నమయ్య: మాదకద్రవ్యాల వినియోగంపై ‘జీరో టోలరెన్స్’తో వ్యవహరించాలని, డ్రోన్లతో నిఘా పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ధీరజ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో, పాఠశాలల వద్ద నికోటిన్ పదార్థాల విక్రయాలను అరికట్టాలని సూచించారు.
NZB: భీమ్‌గల్ పట్టణానికి చెందిన పిండి పోసాని అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల సాయం ఆ కుటుంబానికి అందింది. ఆపదలో అండగా నిలిచిన సునీల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
AP: చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీమంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. కల్తీ పాలతో ప్రాణాలు పోతుంటే TDP ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NRPT: గుండుమల్ మండలంలోని కొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్యాబోధన చేసిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్ బహుమతులను అందజేశారు.
NZB: నవీపేట్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్ విభాగంలో 189 మందిలో 187 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. వోకేషనల్ విభాగంలో 31 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారు. మొత్తం 218 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు.
VSP: మధురవాడ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28, మార్చి 1న టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హీరోలు శ్రీకాంత్, తరుణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 7 జట్ల నుంచి 110 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయనిధికి వినియోగిస్తారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. మొదటి రోజు మూడు జట్లు తలపడనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం RTI ACT-2005 జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసం అనిల్ కుమార్ రెండో సారి నియమితులయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధ్యక్షుడు వర్ని సంతోష్ అధ్యక్షతన శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీంతో నిరంతరం ప్రజల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూ రెండో సారి పదవి దక్కించుకున్న అనిల్‌ను పలువురు అభినందించారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడెన్ చేశాడు. అలాగే, ఈ WCలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్ పాండ్యా, శ్రీలంకతో మ్యాచ్‌లో హెన్రీ(NZ) కూడా తమ తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా వేశారు. అయితే, ఈ మూడు మెయిడెన్ ఓవర్లు కూడా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనే రావడం గమనార్హం.
W.G: భీమవరం గొస్తా నది – వేల్పూరు కాలువపై నూతన వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే 1 టౌన్ నుంచి 3టౌన్ మధ్య దూరం మూడు కి.మీ. తగ్గుతుందని వివరించారు. ముఖ్యంగా 2027 పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను త్వరితగతిన నిర్మించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
JN: పాలకుర్తిలో తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని 137 గ్రామ పంచాయతీల సర్పంచులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్నారు.
VZM: జామి మండలం విజినగిరి-తానవరం గ్రామాల మధ్య శుక్రవారం ఎమ్మెల్యే లలిత కుమారి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 కోట్లు నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ పాల్గొన్నారు.
KDP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లిపోవడంతో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.