NRPT: జిల్లాలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో సూచనలు జారీ చేశారు. SSC ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని రేపు శ్రీ కృష్ణ గోకులం హైస్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందని, సమయానికి అందరూ హాజరు కావాలన్నారు.
NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఇవాళ ఎంపీడీవో గాయత్రి పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్ను సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని, దోమల బెడద అధికమైందని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలని అన్నారు. లేకపోతే వెంకటేశ్వరస్వామే వారిని శిక్షిస్తారని తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో కల్తీ అని తేలినా.. మరో సంస్థ పేరుతో 4 ట్యాంకర్ల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యిపై చర్చించాలని కోరితే ప్రభుత్వం తోకముడిచింది’ అని విమర్శించారు.
కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి అశోక్ నగరులో గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వార్డ్ సభ్యులు మీర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో శుక్రవారం ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ.. డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీటిని తొలగించి దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని గుంటూరు గ్రామానికి చెందిన తుప్పల సత్యనారాయణకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇవాళ అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయినట్లు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ మార్కెట్‌కు సుమారు 70 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్‌ను రూ.110కు, రెండో రకం బాక్స్‌ను రూ. 90కు కొనుగోలు చేశారు. పంట దిగుబడి బాగున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BHNG: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజనా బాలమణి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక సానిటైజర్ డ్రైవ్ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఇతర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
KRNL: ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని శుక్రవారం యార్డు కార్యదర్శి గోవిందు తెలిపారు. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.18 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే రూ.18.40 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రైతులకు పంటలు బాగా దిగుబడి రావడంతో యార్డులో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు.
TG: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో గల్ఫ్ నుంచి ఇక్కడికి రావాల్సిన మరో 12 విమానాలు కూడా నిలిచిపోయాయి. ఖతార్, UAE, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలకు రాకపోకలు సాగించే విమానాలు ఇందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ విమాన సమాచారాన్ని ముందే సరిచూసుకోవాలని సూచించారు.
WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ మెంబర్ వరద రాజేశ్వర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన సందర్బంగా వేం నరేందర్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కడప: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలోని 6,7,8వ డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఇవాళ పరిశీలించారు. కార్మికుల మస్టర్ అటెండెన్స్ తనిఖీ చేసి అధికారులు సమయానికి పనులు చేపట్టి నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై సూచనలు చేశారు.
ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని పునరావాసం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాష్ రూమ్, ఇతర సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు కూడా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అందిస్తున్నాయని వాపోతున్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.
AP: వైసీపీ పాలనలో ఊహించని విధంగా విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేయాలని మూడు పార్టీలు భావించినట్లు తెలిపారు. ‘YCP వ్యతిరేక ఓటు చీలకూడదని ఎన్నికల్లో ఒక్కటయ్యాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో పని చేస్తున్నాయి. దారుణమైన ఆర్థిక వ్యవస్థ మనకు వారసత్వంగా వచ్చింది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని తెలిపారు.
NZB: కమ్మర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇల్లు లభించినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.