PDPL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2025- 26 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని అక్షిత ప్రతిభ చాటింది. బాక్సింగ్ అండర్-60 వెయిట్ కేటగిరీలో పోటీపడి రజత పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓదెల ఎంఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.
NGKL: పుట్టగానే కులోన్మాదానికి బలైతానని పాపం ఆ బిడ్డకు ఏం తెలుసు?, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ నేడు కానరాని లోకాలకు వెళ్లింది. 9 నెలలు మోసిన ఆ తల్లి కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో. ఫులే, అంబేడ్కర్ లాంటి మహనీయులు ఎంత మంది పోరాడినా ఇప్పటికీ కుల వివక్ష ప్రాణాలు తీస్తోందన్న దానికి కుమ్మెర ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 83,340.08 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభంతో 25728.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.73గా ఉంది.
MLG: కన్నాయిగూడెంలో దేవాదుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాల వివాదానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని తెలిపారు.
AP: బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఎర్రన్నాయుడు పేరుగడించారని చెప్పారు. కేంద్రమంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా లోకేష్ నివాళులర్పించారు.
JN: చిల్పూర్ మండలంలోని లూనావత్ తండాకు చెందిన గుగులోతు సురేష్ (24) కొబ్బరి చెట్టు నుంచి కింద పడి మృతిచెందాడు. కొబ్బరిచెట్టు ఎక్కి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.
KMM: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దరఖాస్తులు కోరారు. గత ఐదేళ్లలో 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, అందులో 50% మంది మొదటి శ్రేణిలో నిలిచిన రాష్ట్ర/కేంద్ర గుర్తింపు పొందిన పాఠశాలలు దీనికి అర్హులన్నారు.
SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని కోళ్ల షెడ్లలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్లు చనిపోతున్నాయని అనుమానిస్తున్న యజమాని, జెసిబితో గుంతలు తీసి వాటిని పాతిపెట్టారు. అయితే, వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PDPL : గోదావరిఖని బెడెన్ పావెల్ పార్కులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు, బెడెన్ పావెల్ 169వ జన్మదినం, ‘వరల్డ్ థింకింగ్ డే’ ఆదివారంఘనంగా నిర్వహించారు. RG-1 SO to GM చంద్రశేఖర్ పావెల్ విగ్రహానికి నివాళులర్పించి, స్కౌట్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 200 మంది విద్యార్థులతో ‘శాంతి ప్రగతి యాత్ర’ చేపట్టారు. స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.
NZB: రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో పూల్ విన్నర్‌గా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో నిజామాబాద్ క్రీడాకారిణులు వరుస విజయాలు సాధించారు. హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జట్లను మట్టికరిపించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
ATP: గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో సోమవారం బైకు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఉపాధ్యాయుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధి మన్నూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వల్లీ దేవసేన సమేత స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
HNK: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల పాలిట వరంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. 45వ డివిజన్ పరిధి లోని కడిపికొండకు చెందిన దామెరుప్పుల సురేష్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2,50,000/-చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సోమవారం పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
KMR: కామారెడ్డి జిల్లా ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కళాశాల ఆస్తుల విషయంలో నేరుగా కలెక్టర్ వద్దనే కూర్చుందామని, నేడు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ చేశారు. దాంతో కళాశాల ఆస్తుల అన్యాక్రాంతం అంశం ఇప్పుడు కలెక్టర్ వద్దకు చేరింది. సోమవారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.