MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన నందినికి రూ.32 వేల సీఎం సహాయ నిధి (CMRF) చెక్‌ను మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో పేదలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుకుమార్ రెడ్డి, చందర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని, నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
CTR: నగరపరిధిలో 40వ వార్డులో రూ.9.55 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా సంస్కృతిని రక్షించి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు.
ELR: ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కస్టోడియన్ శ్రీనివాసరావు చలమాల తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ 2,357 మంది, సెకండ్ ఇయర్ 2,191 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
కడప: నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నింగి నుండి నిఘా ఉంచుతూ.. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
AP: కేసులకు వైసీపీ కార్యకర్తలు భయపడకూడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే జైళ్లు సరిపోతాయా అని నిలదీశారు. జైలు భరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్‌ను ఎవరూ లెక్కచేయరని తేల్చి చెప్పారు. మూడేళ్ల తర్వాత జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
ప్రకాశం: భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం తగదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
TG: జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక స్నేహ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్‌పై కాబోయే వరుడు తరుచూ ఫోన్‌లో వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
VSP: కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన రూ.3.28 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సవాల్ చేశారు. ఆదివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదాయ వృద్ధి కేవలం 1.97% ఉండగా 11.09% జీఎస్డీపీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.39 లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.
KMM: ఉమ్మడి ఖమ్మంలో గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆరో తరగతి బ్యాక్లాగ్ పోస్టుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 480 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 453 మంది పరీక్షకు హాజరైనట్లు మొత్తంగా 94.3 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వివరించారు.
AP: గ్రామీణ డాక్ సేవక్‌లకు మౌలిక వసతులు కల్పించాలని కోరానని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు వచ్చేలా చూశానని చెప్పారు. గ్రామీణ డాక్ సేవక్‌లకు శిరసు వంచి ప్రణామం చేస్తున్నానని పేర్కొన్నారు. తపాలాశాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ సంగంబండ కాలువపై వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీరు పారుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రవాణా, వ్యవసాయ పనులు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
TPT: చంద్రగిరి పట్నంలో పశువుల పండుగ సంబరాలకు ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మిట్టమీద గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని పశువుల పండుగను తిలకించారు. ఈ సందర్భంగా పండుగను వీక్షించడానికి తరలివచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలను, కార్యకర్తలను అభిమానంగా పలకరించారు.
WNP: రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు శివ హెచ్చరించారు. చీర్ల చందర్ ని అవమానించేలా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఆధారాలు లేకుండా బురదజల్లడం మానుకోవాలని, బీసీల ఐక్యతకు భంగం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు పలువురు నిరసన వ్యక్తం చేశారు.