AP: పల్నాడు జిల్లా మాచర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటికి ‘దాహంగా ఉంది, నీళ్లు కావాలి’ అంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోని మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
IPL 2026లో భాగంగా ఇవాళ జరిగే చెన్నై vs పంజాబ్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచ్‌ల్లో 16-16 విజయాలతో ఇరుజట్లు పోటాపోటీగా ఆడాయి. అయితే చివరి 8 మ్యాచ్‌లకు ఏడింటిలో చెన్నై పంజాబ్ గెలవడం గమనార్హం. ధోనీ లేకుండా ఆడిన 6 సందర్భాల్లో ఒక్కసారే గెలిచిన చెన్నై.. 7వ సందర్భంలో తమను డామినేట్ చేస్తున్న పంజాబ్‌ను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.
‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తన కెరీర్, వ్యక్తిగత ఇష్టాల గురించి తాజాగా మాట్లాడింది. సవాళ్లతో కూడిన పాత్రలంటేనే ఇష్టమని.. నటిగానే కాకుండా మంచి కూతురిగా, స్నేహితురాలిగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నానంది. ఫొటోగ్రఫీ ప్రాణమని, కెమెరా వెనుక ఉండటమే సంతోషాన్నిస్తుందని వెల్లడించింది. నిత్యం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని, ఒకే వృత్తికి పరిమితం కావొద్దని సూచించింది.
TPT: తమిళనాడు (ఏప్రిల్ 23), పుదుచ్చేరి(ఏప్రిల్ 9)లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో AP ప్రభుత్వం సరిహద్దు జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలకు సెలవు ప్రకటించింది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపులు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ కూలీలకు పేయిడ్ లీవ్ ఇవ్వాలని ఆదేశించింది.
ATP: జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 577 పంచాయతీలకు గాను, ఇప్పటికే ఎన్నికలు జరగని రెండు చోట్ల పాత పాలనే సాగుతోంది. మిగిలిన 575 పంచాయతీలకు కొత్తగా అధికారులను నియమించినట్లు డీపీఓ నాగరాజు నాయుడు వెల్లడించారు.
MBNR: జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ డి. జానకి తెలిపారు. మార్చి నెలలో షీ టీమ్స్ 15 ఫిర్యాదులను స్వీకరించి, వేధింపులకు పాల్పడుతున్న 10 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 హాట్‌స్పాట్ తనిఖీలు, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఆపదలో ఉన్నవారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు.
NDL: అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందు భాగాన్ని ఆకర్షణీయంగా రంగవల్లికలతో, దీపాలతో అలంకరించారు. కలెక్టర్ జ్యోతి వెలిగించి, కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు.
PDPL: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లోని అభివృద్ధి పనులు, మంథనిలో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించాలని, పెద్దపల్లి, మంథని బీటీ రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
KRNL: పత్తికొండలో అమరావతి రాజధాని నిర్ణయానికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కే.ఈశ్యాం కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగుతూ ‘జై అమరావతి’ నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి మేలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
VZM: ఈనెల 4న వంగర MPDO కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు MPDO రాజారావు గురువారం తెలిపారు. మండలంలో 2024-25 ఏడాదికి సంబంధించి 29 గ్రామపంచాయతీల్లో ఎస్‌ఆర్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు గ్రామపంచాయతిీల్లో రూ.11.51 కోట్ల ఉపాధి పనులు,సామాజిక భద్రత పెంక్షన్ తనిఖీలు జరిగాయన్నారు.
VSP: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
MDCL: నగరంలోని అల్వాల్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా సంతోష్ దాబా ప్రాంతంలో దోమల బెడద తీవ్రంగా పెరిగింది. నిల్వ నీరు, కాలువల శుభ్రత లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. వెంటనే ఫాగింగ్, కాలువలు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.
NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్‌ను నల్గొండ ఏఐఎంఐఎం నాయకులు కలిశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంఏ ఉర్దూ, LLB, ఫార్మసీ కోర్సులను ప్రారంభించాలని నల్గొండ జిల్లా అధ్యక్షుడు రజీయుద్దీన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అడ్మిషన్ల సౌలభ్యం కోసం పర్షియన్, అరబిక్ వంటి విదేశీ భాషలను కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
GNTR: జిల్లాలో పేదలకు ఉచిత చికిత్స అందించే NTR వైద్యసేవ పథకం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వైద్యసేవలు కొనసాగేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, ఆసుపత్రి సంఘాల మధ్య చర్చలు కొనసాగుతుండగా, త్వరలోనే సేవలు పునఃప్రారంభం అవుతాయన్నారు.
WGL:గ్రేటర్ వరంగల్ పరిధిలో మే నెలలో జరగనున్న జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు ఆదేశించారు. గురువారం రాత్రి నక్కలగుట్ట వార్డు కార్యాలయంలో ఇంటి నంబర్ల మ్యాపింగ్ పనులను తనిఖీ చేశారు. జనగణన సాఫీగా సాగేందుకు ఇంటి నంబర్లు, నివాస గృహాలు, కాలనీల మ్యాపింగ్ ప్రక్రియ సహాయపడుతుందని అన్నారు.