బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఊహించని షాక్ లు ఎదురౌతున్నాయి. పార్టీ మారీ ఉప ఎన్నికలు దిగగా… అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. మునుగోడు ప్రజలు రాజ్ గోపాల్ రెడ్డిని కాదని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే… తాజాగా ఆయనకు రాష్ట్ర జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా, ఈ సోదాలు ఇవాళ మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారుల బృందం.. సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్లను 4 గంటలుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. బంజారాహిల్స్ రోడ్-12లో కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సుశి ఇన్ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీకి చెందిన 25కు పైగా బృందాలతో 4 గంటలుగా సోదాలు చేస్తున్నారని, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు.
నిజానికి ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో సుశీ ఇన్ ఫ్రా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ సంస్థకు కేంద్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కేటాయించిందని .. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేశాయి. అయితే వీటిని రాజగోపాల్ రెడ్డి ఖండిస్తూ ఓపెన్ బిడ్డింగ్‌లో తమ సంస్థకు ఈ కాంట్రాక్ట్ వచ్చిందని ప్రకటించారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడు నియోజకవర్గంలో కొంత మంది నేతలకు రూ. కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై ఆధారాల్లేవని ఈసీ ఆ ఫిర్యాదు తోసిపుచ్చింది.