కేంద్ర బడ్జెట్ చదువుతున్న సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తడబడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుక్కు గురించి ప్రసంగిస్తున్నారు. ‘రీ ప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ అని చదవాల్సిన సమయంలో పొల్యూటింగ్ ప్లేస్‌లో పొలిటికల్ అన్నారు. వెంటనే విపక్ష నేతలు అరిచారు. తప్పును సవరించుకుని.. పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. దీంతో సభలో ఉన్న మిగతా మంత్రులు కూడా చిరునవ్వు నవ్వారు.
2021-22లో పాత వాహనాలకు సంబంధించి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు స్క్రాప్ కిందకు అని కేంద్రం స్పష్టంచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. పాత వాహనాలను రీ ప్లేస్ చేస్తున్నామని.. తమకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పాత అంబులెన్స్‌లను కూడా రీ ప్లేస్ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. పాత వాహనాల నిబంధన దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతుంది. మిగతా రాష్ట్రాల్లో అంతగా పట్టించుకోవడం లేదు.
2070 నాటికి దేశం హారితమయంగా మారనుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. దీంతోపాటు 5జీ సేవల కోసం ప్రత్యేకంగా ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. పీఎం విశ్వ కర్మ యోజన తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో కొత్త 50 హెలిప్యాడ్, ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడతామని వివరించారు. కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించారు.