కేరళలో (Kerala) ఘోర ప్రమాదం (Tragedy) చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ పడవ (Boat) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏకంగా 22 మంది మరణించారు. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు (Children) ఉండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ (Modi), ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
మళప్పురం జిల్లా (Malappuram District) తన్నూరు సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ హౌస్ బోట్ (House Boat) పడవ ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బోల్తా పడింది. తువల్ బీచ్ (Tuvalthiram Beach) సమీపంలో విహారం కోసం 30 మందికి పైగా పడవలో ప్రయాణం మొదలుపెట్టారు. తీరానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఇప్పటివరకు 22 మంది జల సమాధి అయ్యారు. మరో 8 మందిని పోలీస్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), భారత నౌకాదళం (Indian Navy) రక్షించారు. కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండడం గమనార్హం.
సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు (Passengers) ఎక్కడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. వాస్తవంగా పడవలో 30 మందిలోపు ప్రయాణించాల్సి ఉంది. అయితే దాదాపు 50 మంది పడవలో ప్రయాణించినట్లు సమాచారం. చాలా మంది టికెట్ లేకుండానే పడవ ఎక్కినట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక ఎమ్మెల్యే పీకే కున్హళికుట్టి తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత పడవ ప్రయాణాలు నిషేధం ఉంది. కానీ నిబంధనలు అతిక్రమించి పడవ ప్రయాణించింది. ఈ ప్రమాదంతో కేరళలో తీవ్ర విషాదం అలుముకుంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా (Condolence Day) ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంతాపం ప్రకటించారు. మృతులు, క్షతగాత్రులను సీఎం పినరయి సోమవారం పరామర్శించారు. ఆస్పత్రిలో వారిని పరామర్శించి కారణాలు తెలుసుకున్నారు.
Malappuram boat accident: Kerala CM Pinarayi Vijayan arrives at Taluk Hospital, Tirurangadi in Malappuram district where survivors of the incident are admitted.