ప్రేమ మానవుడి జీవితాన్ని అందంగా.. మధురంగా మార్చే ఒక సాధనం. ప్రేమ లేని సమాజమే లేదు. ఆ ప్రేమ కోసం ఎంతటి కష్టాలనైనా.. త్యాగాలనైనా చేస్తారు. అలాంటి ప్రేమ ఇద్దరి యువతుల మధ్య చిగురించింది. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒప్పందం ప్రకారం ఒకరు అబ్బాయిగా మారింది. పురుషుడి అవతారంలోకి రాగానే సదరు యువతి తిరస్కరించింది. తనతో కలిసి ఉండలేనని చెప్పడంతో అబ్బాయిగా మారిన ఆ యువతి పరిస్థితి గందరగోళంలో పడింది. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
ఝాన్సీ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు సనాఖాన్, సోనాల్ శ్రీవాత్సవ. వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అసహజమైన వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. 2017లో ఈ యువతులు వివాహం చేసుకుని కాపురం పెట్టారు. మనం కలిసి జీవించాలంటే సనాఖాన్ అబ్బాయిగా మారాలని సోనాల్ చెప్పింది. ప్రేమ కోసం సనా ఖాన్ రూ.6 లక్షలు ఖర్చు చేసి లింగమార్పిడి చేయించుకుంది. పూర్తిగా అబ్బాయిగా మారడంతో సనా ఖాన్ సుహైల్ ఖాన్ గా పేరు మార్చుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
సోనాల్ కు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో అబ్బాయిగా మారిన సనాఖాన్ తో కలిసి ఉండలేనని తేల్చి చెప్పింది. ఇబ్బందిగా ఉంటే మళ్లీ అమ్మాయిగా మారు అని సలహా ఇచ్చింది. అవాక్కైన సనాఖాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఫిబ్రవరి 23న తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మాయిల మనసు అంతే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.