హైదరాబాద్ నగరంలోని నర్సింగి పోలీసు స్టేషన్లో ఒక ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించిన అంశాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, నర్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై జీరో FIR నమోదు చేశారు.
మహిళా కొరియోగ్రాఫర్ చెప్పిన వివరాల్ని పరిగణలోకి తీసుకొని, పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జానీ మాస్టర్ హైదరాబాదులో కనబడలేదు. తరువాత, నార్త్ ఇండియాలో ఉన్నాడని సమాచారాన్ని అందుకున్న SOT పోలీసు బృందం అక్కడకు వెళ్లినా, జానీ మాస్టర్ ఆచూకీ తెలియలేదు.
తరువాత, జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నాడని తెలిసిన తరువాత, SOT పోలీసులు ప్రత్యేక బృందంతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లారు. ఈ ఉదయం ఆయనను అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు.
జానీ మాస్టర్ ను బెంగళూరు కోర్టులో ప్రవేశ పెడతారా లేదా తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడ కోర్టులో ప్రవేశపెడతారా అనే విషయం ఇంకా స్పష్టంగా లేదు. మహిళా కొరియోగ్రాఫర్ నుండి ఫిర్యాదు నమోదు కావడంతో, ఆయనపై POCSO కేసు కూడా నమోదు చేశారు.
ఈ సంఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. జానీ మాస్టర్ పై ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సంబంధిత పోలీసు దర్యాప్తు జరుగుతోంది, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోపక్క టాలీవుడ్ కూడా జానీ మాస్టర్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.