బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ వెనక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పారు. అంతే తప్ప జాతిపై ప్రేమ కోసం కాదని సెటైర్లు వేశారు. ఆయన చెప్పేవి నీతులు అని.. కానీ చేసే పనులు అలా ఉండవని తెలిపారు. ఇవీ జనాలకు కూడా అర్థం అయ్యాయని, అందుకే కొత్త డ్రామాలకు కేసీఆర్ తెరతీస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు, విస్తరణ ఎందుకో అందరికీ తెలుసు అని వివరించారు. కేటీఆర్‌కు పగ్గాలు అప్పగించాల్సిన సమయం వచ్చేసిందని, అందుకు అడ్డుగా ఉంది హరీశ్ రావేనని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో.. అతని అడ్డు తొలగించుకునేందుకు భారీ ప్లానే వేశారని చెప్పారు. జాతీయ పార్టీగా రూపాంతరం చేసి.. కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటారని, రాష్ట్రంలో పార్టీని ఒకరికీ అప్పగిస్తారని అంటున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లేదంటే ఇతర పదవీని హరీశ్ రావుకు అప్పగిస్తారని చెబుతున్నారు. దీంతో కేటీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చొబెట్టే పని మరింత సులువు అవుతుందని ప్రభాకర్ ఆరోపించారు. హరీశ్ రావు నుంచి పదవీ పరంగా కేటీఆర్‌కు థ్రెట్ ఉందని కేసీఆర్‌కు తెలుసు.. అందుకే తెలివిగా ఢిల్లీకి పంపించబోతున్నారని తన అంచనాలతో సహా ప్రభాకర్ వివరించారు.
మిగతా పార్టీ నేతలను బీఆర్ఎస్ ఆకర్షించి, ఫిరాయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అయినప్పటికీ ఈ అంశంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రియాక్ట్ కాలేదన్నారు. ఇదీ తనకు నిజంగా ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని దీనిని బట్టి అర్థం అవుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ విమర్శించడం లేదంటే కారణం ఇదే అయి ఉంటుందని చెప్పారు. అంతేకాదు కమ్యూనిస్టులు కూడా కేసీఆర్‌కు అనుకూలంగా మారిపోయారని పేర్కొన్నారు. వారు కోరడంతోనే ఖమ్మంలో కేసీఆర్ సభ పెడుతున్నారెమో అని అనుమానం వ్యక్తం చేశారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లను సలహాదారులుగా తీసుకుంటున్నారని కామెంట్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో కేసీఆర్ చేసింది ముమ్మాటికీ తప్పేనని మండిపడ్డారు.
ఖమ్మం సభలో రైతులకు దిక్సూచి చూపిస్తానని కేసీఆర్ చెపుతున్నారని ప్రభాకర్ అన్నారు. మరీ అదే ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండటాన్ని రైతులు అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. రైతులకు వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, వారి పాసు పుస్తకాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందని చెప్పారు. రుణమాఫీ చేయడం లేదని, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై ఇవ్వడం లేదని మండిపడ్డారు.