కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగి అవకాశం బిజెపిలోనే ఉంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, మిగతా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తను అయిన తను రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యానని, చాయ్ వాలా ప్రధాని అయ్యారని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు. నేను దానిని సరిచేసుకోకుంటే అధిష్ఠానానికి కూడా చెప్పుకోవచ్చు అన్నారు. ఇతర పార్టీల్లో అలా ఉండదు అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉంటారని, వారిని అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేరు అన్నారు.
చిన్నచిన్న కారణాలతో బిజెపిని వీడిన వారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. సైద్ధాంతిక భావాలు ఉండి, చిన్నచిన్న కారణాలతో పార్టీని వీడినవారంతా ఘర్ వాపసీ కావాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాయలంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. సినిమా రంగం నుండి వచ్చిన వాళ్లు పాతికేళ్ళు రాజకీయాల్లో కొనసాగడం సాధారణ విషయం కాదన్నారు. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువని, అవన్నీ తట్టుకుని నిలబడటం గొప్ప విషయమన్నారు.
పార్లమెంటు లోపల, బయట ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు ఒక అసమర్థుడి చేతిలో పడిందని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ ముసుగులో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోందన్నారు. 2009 లోకసభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.