గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్(morbi bridge) కూలి దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ పోలీసులు 9 మందిని అరెస్టు(9 people arrested) చేశారు. వీరిలో బ్రిడ్జ్ కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారని రాజ్ కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో వందమందికి పైగా గాయపడ్డారన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, ‘సిట్’ దర్యాప్తు జరుపుతుందని ఆయన చెప్పారు.
ఈ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ బాధ్యతలు చేబట్టిన ఒరేవా గ్రూపు దీని మరమ్మతు పనులను పర్యవేక్షించిందన్నారు. అసలు గుజరాత్ లోని ఒరేవా కంపెనీ .. ‘అజంతా’ గోడ గడియారాలను, బల్బులను ఎలెక్ట్రానిక్ బైకులను తయారు చేసే సంస్థ అని, దీనికి 100 ఏళ్ళ నాటి ఈ వంతెన మరమ్మతు బాధ్యతలను ఎలా అప్పగించారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
సుమారు 800 కోట్ల రూపాయల టర్నోవర్ గల ఈ కంపెనీ ప్రస్తుతం ఎలెక్ట్రిక్ లాంప్స్, క్యాలిక్యులేటర్స్, సెరామిక్ ప్రాడక్టులను కూడా ఉత్పత్తి చేస్తోంది. మచ్చూ నదిపై గల ఈ బ్రిడ్జిని ఏడు నెలల క్రితం మూసివేశారు.కొంత కాలం క్రితం మరమ్మతులు చేశాక అక్టోబరు 26 న గుజరాతీ న్యూ ఎయిర్ ని పురస్కరించుకుని మళ్ళీ దీన్ని ప్రారంభించారు.
మోర్బీ మున్సిపాలిటీ ఈ వంతెనకు సంబంధించిన కాంట్రాక్టును, మెయింటెనెన్స్ బాధ్యతలను ఒరేవా సంస్థకు అప్పగించింది. కానీ ఈ ప్రమాదంలో తమ బాధ్యత ఏదీ లేదని ఈ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు దీని మధ్యభాగానికి చేరి దీన్ని అటూఇటూ ఊపిన ఫలితంగా ఇది కుప్పకూలిందని, వారి సంఖ్యను అధికారులు అదుపు చేయాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు.