PM Modi Russia Visit : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. అందుకు సోమవారం ఆయన బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆయన పర్యటన తమకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభం అయిన తర్వాత మోదీ రష్యా పర్యటనకు(Russia Visit ) వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు.
మోదీ( Pm Modi) పర్యటన విషయమై రష్యా(Russia) ఓ ప్రకటన విడుదల చేసింది. మోదీ రాకపై కీలక వ్యాఖ్యలు చేసింది.పాశ్చాత్య దేశాలు ఏ పర్యటన పట్ల చాలా ఈర్ష్యతో ఉన్నాయని వ్యాఖ్యలు చేసింది. మోదీ అక్కడ జరగబోయే 22వ భారత్ – రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొటారని తెలిపింది. పర్యటనకు బయలు దేరే ముందు మోదీ సైతం ఈ విషయమై స్పందించారు. స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. అందుకు ఇలాంటి పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నట్లు తెలిపారు.
మోదీ పర్యటన గురించి రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ సైతం మీడియాతో మాట్లాడారు. అక్కడ జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారని తెలిపారు. రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే దేశాధ్యక్షులు ప్రాధాన్యం ఇవ్వనున్నారని అన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మోదీ 10వ తారీఖున అధికారిక ఆస్ట్రియా పర్యటన చేపట్టనున్నారు. గత 41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియా వెళ్లడం ఇదే మొదటి సారి.