Kejriwal : తన ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందన్న కేజ్రీవాల్
బెయిల్ కోసం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నారని ఈడీ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. తన ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఘాటుగా స్పందించారు.
Arvind Kejriwal : తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తన ఆహారంపై ఈడీ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ బెయిల్ కోసం చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారని, మామిడి పండ్లు తింటున్నారని ఈడీ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయమై కేజ్రీవాల్(Kejriwal) సీరియస్ అయ్యారు. తన ఆహారాన్ని రాజకీయం చేయవద్దని తెలిపారు. తన భోజనానికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు.
కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ భోజన విషయాలను కోర్టుకు అందజేశారు. ఆ వివరాల ప్రకారం.. తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి 48 సార్లు భోజనం వచ్చింది. అందులో మూడు సార్లు మాత్రమే మామిడి పండ్లు ఆయన తిన్నారు. దుర్గా పూజ రోజు ప్రసాదంగా ఆలూని తిన్నారు. ఏప్రిల్ ఒకటిన కోర్టు అనుమతించిన డైట్ ఛార్ట్ ప్రకారమే ఆయన ఆహారం తింటున్నారని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వెల్లడించారు.
దిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) కేజ్రీవాల్ టీ తాగే సమయంలో చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటనర్ వేసుకుంటారని, లేదంటే చక్కెర లేకుండా తాగుతారని తెలిపారు. ఆయన భోజనంలో షుగర్‌ని పెంచే స్వీట్లు, పండ్లు లేవని వెల్లడించారు. దీంతో ఇరు వైపు వాదనలను విన్న కోర్టు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, జైలు అధికారులను ఆదేశించింది.