»Telangana Government Income For 670 Crore Rupees With The Sale Of Beer In 18 Days
Telangana : తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు! ఆల్‌టైం రికార్డ్
వేసవి తాపం, పెళ్లిళ్ల సీజన్ లాంటి కారణాలతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు జోరు మీద సాగుతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా రూ.670 కోట్ల విలువైన బీర్లు అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Beer Sales in telangana : వేసవి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు సైతం భారీగా జరుగుతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరో వైపు సెలవులు, తోడుగా ఎండలు ఉండటంతో జనం బీర్లను(Beers) పెద్ద మొత్తంలోనే తాగేస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా రూ.670 కోట్ల అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
ఏప్రిల్ 18వ తారీఖు వరకు ఏకంగా 23,58,827 కేసుల బీర్లు(Beers) అమ్ముడైపోయాయి. ఇది ఆల్‌టైం రికార్డని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది 2024 ఏప్రిల్ నెలలో ఏకంగా 28.7 శాతం మేర ఎక్కువగా అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల నే అమ్మకాలు ఇంతలా పెరిగిపోయినట్లు భావిస్తున్నారు.
ఏప్రిల్ నెలలో డిమాండ్‌కి సరిపడా సప్లై లేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బీర్ కంపెనీల నుంచి రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల కేసుల వరకు అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మొత్తం అమ్ముడు అయిపోతున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా తెలంగాణ(Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో బీరు డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో బీరుకు కొరత ఏర్పడవచ్చని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.