ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు (Heavy Rains), భారీ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్న ఘటనలతో హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh) విలవిల్లాడుతోంది. ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తమకు పీడకలగా మారిందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి కన్నా చావడమే మేలనిపిస్తోందంటూ ప్రొమిలా అనే మహిళ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు.
‘‘ఆగస్టు 23న కొండచరియలు (Landslides) విరిగిపడటంతో మేం ఉండే భవనం ధ్వంసమైంది. నేను మా అమ్మ(75 ఏళ్లు)తో కలిసి ఉంటున్నా. ఆమె క్యాన్సర్ బారిన పడి 2016 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల భారీ వర్షాలకు నా ఉద్యోగం సైతం పోయింది. ఓ దుకాణంలో సేల్స్ గర్ల్(Sales girl)గా పనిచేసేదాన్ని. వర్షాల కారణంగా కస్టమర్లు రాకపోవడంతో షాపు మూసివేశారు. ఇల్లు కూలిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదు. రాత్రి నేను మా అమ్మ చికిత్సపొందుతున్న ఆస్పత్రి(Hospital)లోనే నిద్రపోవాల్సి వచ్చింది’’ అని ప్రొమిలా ఆవేదన వ్యక్తంచేశారు. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న సదరు మహిళ (woman) తనకు తండ్రి గానీ, తోబుట్టువులు గానీ లేరని.. తనకు ఉన్నదల్లా అమ్మ మాత్రమేన్నారు. జాబ్(Job) కోసం తీవ్రంగా వెతుకుతున్నానని.. తన తల్లి చికిత్స కోసం చాలా డబ్బు అవసరం ఉన్నందున క్లీనింగ్ పనిచేసేందుకైనా సిద్ధంగానే ఉన్నానంటూ కన్నీటి గాథను చెప్పుకొచ్చారు.
భవనం కూలినప్పుడు భయంతో బయటకు పరుగులు తీయడంతో కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని సుమన్ అనే మరో మహిళ విలపించారు. తాను ఇళ్లలో పనిచేస్తుంటానని.. తన కొడుకు స్కూల్ ఫీజు (School fees) కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు. తమకు ఆశ్రయం లేదని.. బట్టలు కూడా పోయాయంటూ వాపోయారు. ఐదో తరగతి చదువుతున్న తన కుమారుడి బుక్స్ సైతం పోయాయంటూ ఆవేదన చెందారు కానీ తమకు ఎలాంటి సాయంగానీ, తక్షణ ఉపశమనం గానీ లభించలేదన్నారు. శిమ్లా(Shimla)లో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనలతో జూన్ 24 నుంచి ఆగస్టు 24వరకు 242మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు ₹10వేల కోట్ల ఆస్తినష్టం (Property damage) సంభవించింది.