ప్రేమ, పెళ్లి, శృంగారం, అబార్షన్ విషయాలపై తాజాగా సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. మహిళలు పెళ్లికి ముందు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని… అవసరమైతే అబార్షన్ కూడా చేయించుకోవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. వైవాహిక అత్యాచారాలపై కూడా సంచలన తీర్పు వెలువరించింది. అవివాహిత స్త్రీలు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
భార్యతో బలవంతపు సెక్స్ రేప్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అది వైవాహిక అత్యాచారం కిందే పరిగణింపబడుతుందని తేల్చి చెప్పింది.ఇక నుంచి అటువంటి చర్యలను నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
బలవంతపు సెక్స్ ద్వారా కలిగే గర్భాన్ని అబార్షన్ చేసుకునే అధికారం భార్యకు ఉందని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఏ స్త్రీ అయినా 24 వారాలలోపే అబార్షన్ చేయించుకోడానికి అనుమతి ఇచ్చింది.ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదని కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆధునిక కాలంలో.. వివాహిత స్త్రీలు మాత్రమే శృంగారంలో పాల్గొనాలనే నిబంధనలు ఏమీ లేవని తెలిపింది.
MTP చట్టం నేటి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పాత నిబంధనలకు పరిమితం కాకూడదని..చట్టం అలాగే ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మారుతున్న సామాజిక వాస్తవాలను గుర్తుంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై పలు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమాజిక కట్టుబాట్లు, నైతిక ఉల్లంఘనలకు తొలి అడుగని కొందరు సామాజిక కార్యకర్తలు అంటున్నారు.