»Security Failure In Parliament Thugs Who Jumped Into The House
Parliamentలో భద్రతా వైఫల్యం..సభలోకి దూకిన దుండగులు
భారత కొత్త పార్లమెంటు హౌస్‌లో ఎంపీలు చూస్తుండగానే లోక్‌సభ విజిటర్ గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు స్పీకర్ వెల్‌లోకి దూకారు. షాక్‌కు గురైన ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు.
Parliament: పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్‌సభ విజిటర్ గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగానే ఇద్దరు దుండగులు స్పీకర్ వెల్‌లోకి దూకారు. దీంతో ఎంపీలు షాక్‌కు గురై భయాందోళనతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి దుండగులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. స్టార్ట్ అయిన కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా ఈ కలకలం రేగింది. సందర్శకుల గ్యాలరీ నుంచి స్పీకర్ వెల్‌లోకి దూకి.. అక్కడే ఉన్న గ్యాస్ సిలెండర్లను ఓపెన్ చేశారు. సభ్యులు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని నినాదాలు చేశారని తెలుస్తోంది.
ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్లో ఇలాంటి ఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు. సరిగ్గా ఇదే రోజు 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. అయితే కొత్త పార్లమెంట్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భద్రతా పరంగా కొత్త పార్లమెంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు అధునాతన పరిజ్ఞానంతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ ఘటన జరగడంతో పార్లమెంట్ భద్రతపై అనుమానలు రేకెత్తుతున్నాయి.