Droupadi Murmu: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. కొత్త పార్లమెంట్లో ఇదే నా తొలి ప్రసంగమని ముర్ము తెలిపారు. మన దేశం గతేడాది ఎన్నో ఘనతలు సాధించిందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జీ20 సమావేశాలను కూడా విజయవంతంగా నిర్వహించామన్నారు. శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం సాకారమైంది.
ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించమన్నారు. శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం. తెలంగాణలో సమ్మక్క-సార్క్ గిరిజన వర్సిటీ ఏర్పాటు కానుందని ముర్ము తెలిపారు. చిన్నతనం నుంచి గరీబీ హఠావో నినాదాన్ని వింటున్నాం. కానీ జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోందని ముర్ము తెలిపారు. కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై భారం పడకుండా చూశాం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచామన్నారు. అలాగే పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ముర్ము తెలిపారు.