పూరీ జగన్నాథ రథ యాత్ర వచ్చే ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
PURI RATH YATRA 2024: జగన్నాథ రథ యాత్రకు పూరీ సిద్ధం అవుతోంది. వచ్చే ఆదివారం జరిగే ఈ ఉత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన పండుగ అని చెబుతారు. ఇది జూలై 7న ప్రారంభమై 16న ముగుస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ సందర్భంగా ప్రజలు పూరీకి చేరుకుంటారు. దీంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను(SPECIAL TRAINS) నడిపేందుకు రైల్వే శాఖ(INDIAN RAILWAYS) కసర్తత్తులు చేస్తోంది.
దేశ వ్యాప్తంగా మొత్తం 315 అన్ రిజర్వ్డ్ రైళ్లను పూరీ ఉత్సవాల కోసం రైల్వే శాఖ తిప్పనుంది. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ని సైతం సిద్ధం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ రిజర్వ్డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను(SPECIAL TRAINS) నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. మొత్తం ఎనిమిది రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణించనున్నాయి.
పలాస-పూరీ స్పెషల్ ట్రైన్ (08331) ఈ నెల 7, 15, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది పలాసలో రాత్రి 12:30కు బయలుదేరుతుంది. పూరీకి ఉదయం 5:35కు చేరుకుంటుంది. అలాగే పూరీ-పలాస స్పెషల్ ట్రైన్ (08332) 8, 16, 18 తేదీల్లో తిరుగు ప్రయాణంలో ఉంటుంది. ఇది పూరీలో ఉదయం 4 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 10:05కు పలాస చేరుకుంటుంది. ఇదే విధంగా విశాఖపట్నం -పూరీ స్పెషల్ సైతం 6, 14, 16 తేదీల్లో అందుబాటులో ఉంది. గుణపూర్-పూరీ, జగదల్పూర్-పూరీ ట్రైన్లు సైతం ఏపీ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.