PM Modi: The prime minister is furious with the Congress party!
PM Modi: ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎమర్జెన్సీని ఎదిరించిన వాళ్లందరికీ నివాళులర్పించింది ఈరోజే. ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ అణగదొక్కిందన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను మరిచిపోయి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది. పార్టీని వ్యతిరేకించిన వాళ్లను హింసించారు.
బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారన్నారు. నాడు ఎమర్జెన్సీ విధించిన వాళ్లకి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదన్నారు. పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు. నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉందన్నారు. రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచి.. ఇప్పుడు నటిస్తున్నారన్నారు. కానీ వాళ్ల చేష్టలను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.