»Onion Prices Onion Prices Will Increase Once Again Farmers Are Worried
Onion Prices: మరోసారి పెరగనున్న ఉల్లి ధరలు..ఆందోళనలో రైతులు!
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాలు, నిబంధనల వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ధర్నాకు దిగారు. దీంతో ఉల్లి విక్రయాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీనివల్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మరోసారి ఉల్లి ధరలు (Onion Prices) పెరగనున్నాయి. ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలపై విధించిన ఆంక్షలు, నిబంధనలతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చేస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద ఉల్లి విక్రయాల మార్కెట్ మహారాష్ట్ర (Maharastra)లోని నాసిక్ లో ఉంది. ఈ నాసిక్ మార్కెట్ లోని ఉల్లి వ్యాపారులు కేంద్రం తీరుపై ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను తీర్చాలని, అప్పటి వరకూ తమ మార్కెట్లో ఉల్లి విక్రయాలు జరగవని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో అటు వినియోగదారులు, ఇటు రైతులు, వ్యాపారులు తీవ్రంగా నస్టపోతున్నారు. ధర్నా మరిన్ని రోజులు కొనసాగితే ఉల్లి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.
నాసిక్ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ మార్కెట్లలో ఉన్నటువంటి కమిటీలలో ఉల్లి వేలాన్ని నిలిపివేసినట్లుగా ఉల్లి వ్యాపారుల సంఘం తెలిపింది. రైతుల ధర్నాల వల్ల దాదాపుగా 30 వేల క్వింటాళ్ల ఉల్లి విక్రయాలు జరగలేదు. దీంతో ఉల్లి చెడిపోతుందని, తద్వారా ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్య వల్ల అటు రైతులు, ఇటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.