ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట.
మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు దిగుతున్న సమయంలో ఎఎస్ఐ సమీపంలో ఉండి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. మంత్రి నబా దాస్ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లను గోపాల్ దాస్ పర్యవేక్షిస్తున్నారు. దాస్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు.
గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అతని భార్య జయంతి దాస్ ఓ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. తన కూతురు మాత్రం వీడియో కాల్ చేసిందని చెప్పింది. ఐదు నెలల క్రితం చివరిసారి తన భర్త ఇంటికి వచ్చాడు. గత ఏడు, ఎనిమిదేళ్లుగా మానసిక సమస్యకు చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. మందులు వాడిన తర్వాత మాములుగానే ఉండేవారు’ అని గోపాల్ దాస్ భార్య జయంతి దాస్ వివరించింది.