Narendra Modi: భారత ప్రధాని మంత్రి నరేంద్రమోడీ యువతను ఉద్దేశించి మాట్లాడారు. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పొల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని తెలిపారు. చంద్రయాన్ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ధైర్యంగా యవత సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. యువత అంటేనే శక్తికి నిదర్శనం. యువతలో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. వాటితో వేగంగా పనిచేయడమే వారికున్న సామర్థ్యంమని మోదీ పేర్కొన్నారు.
దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇదే యువతకు మంచి సమయం అని వ్యాఖ్యనించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ యువత ముందుకు సాగాలని మోదీ సూచించారు. 2014లో భారత్ నాలుగు వేల ఆవిష్కరణలకు పేటెంట్లు పొందింది. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 50 వేలకు చేరిందని మోదీ తెలిపారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా శాస్త్రవేత్తలు భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు.