»Last Type Writing Exams This Year Good Bye To Type Writing
Type writing : కాలగర్భంలోకి టైప్ రైటింగ్.. ఈ ఏడాదే ఆఖరి పరీక్షలు!
టైప్ రైటింగ్ ఇక కాల గర్భంలో కలిసిపోనుంది. దాని స్థానంలో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్.. కోర్సుల రూపంలో లభించనుంది. టైప్ రైటింగ్‌కి సంబంధించిన పరీక్షలు ఈ ఏడాదితో ముగుస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇక జరగవు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Type writing : టైప్ రైటింగ్.. ఒకప్పుడు వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. స్టెనో గ్రాఫర్లు, టైపిస్టులుగా చాలా మందికి అవకాశాలు కల్పించింది. అందుకనే ఒకప్పుడు టైపింగ్‌ని అంతా ఎంతో ఆసక్తిగా నేర్చుకునే వారు. తర్వాత కంప్యూటర్లు వచ్చాయి. అయినా టైప్ మిషన్‌పై టైప్ చేయడం వచ్చిన వారు కంప్యూటర్లపైనా తేలికగా వేళ్లను కదిలించగలిగేవారు. అందుకనే దీనికి ఆదరణ మాత్రం అలాగే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ లాంటి ఉద్యోగాలను ప్రభుత్వం సైతం తీసుకోవడం మానేసింది. బదులుగా కంప్యూటర్ ఆపరేటర్లను భర్తీ చేసుకుంటోంది. దీంతో టైప్ రైటింగ్ కోర్సులు ఇక వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉండవు. దీంతో 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టైప్ రైటింగ్(Type writing) ఇక కనుమరుగు కానుంది.
టైప్ రైటింగ్‌కి(Type writing) సంబంధించిన పరీక్షలు ఈ ఏడాదితో ఆఖరు. వచ్చే ఏడాది నుంచి వీటిని నిలిపి వేసే దిశగా సాంకేతిక విద్యా శాఖ అడుగులు వేస్తోంది. సాధారణంగా ఈ పరీక్షలను సాంకేతిక విద్యా మండలి ఏటా జులై, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తూ ఉంటుంది. ఏటా టైప్ రైటింగ్‌కి నాలుగు వేల మంది, షార్ట్ హ్యాండ్‌కి వెయ్యి మంది చొప్పున ఈ పరీక్షలకు హాజరు అవుతున్నారు. అయితే ఇక ఈ పరీక్షలు ఉండవు. వీటి స్థానంలో ఇక నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. అయితే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పాత పద్ధతి ప్రకారం యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.