»Karnataka Elections 2023 Congress Party Releases Poll Manifesto To Karnataka Offers Free Electricity Grains And Cash Transfer
Karnataka Elections కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రజలకు హామీల వర్షం
ఆ హామీల్లో ప్రధాన అంశం బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం. మత కల్లోలాలు, ఘర్షణలకు తెరలేపుతున్న ఆ సంఘంతో పాటు పీఎఫ్ఐ ను కర్ణాటకలో నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఇక ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు భృతి ప్రకటించారు.
అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) కర్ణాటకలో హోరాహోరీగా పోరాడుతోంది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీనియర్ నాయకులంతా విబేధాలు పక్కనపెట్టి ఒక్క చోటకు చేరారు. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బీజేపీని ఓడించేందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీ ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త హామీలు, పథకాలతో మేనిఫెస్టోను (Manifesto) విడుదల చేసింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో (Mallikarjuna Kharge) కలిసి బెంగళూరులో మంగళవారం మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివ కుమార్ (DK Shivakumar) తదితరులు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. కర్ణాటకలో గెలిచేది కాంగ్రెస్ అని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఆచరణ కానీ హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందని విమర్శించారు. ఆచరణకు వీలయ్యే హామీలను మాత్రమే తమ మేనిఫెస్టోలో ఉంచినట్లు వెల్లడించారు. ఆ హామీల్లో ప్రధాన అంశం బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం. మత కల్లోలాలు, ఘర్షణలకు తెరలేపుతున్న ఆ సంఘంతో పాటు పీఎఫ్ఐ ను కర్ణాటకలో నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఇక ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు భృతి ప్రకటించారు.
మేనిఫెస్టోలో గ్యారంటీ స్కీములు (Garranty Schemes) అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మేనిఫెస్టోలో ప్రధానంగా కీలక అంశాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గృహ జ్యోతి, గృహలక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి, ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలపై కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి చూడండి.
– గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
– గృహలక్ష్మిలో భాగంగా ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు ఆర్థిక సహాయం
– శక్తి పథకంలో భాగంగా ఢిల్లీలో మాదిరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
– నిరుద్యోగులకు యువనిధి పేరిట భృతి చెల్లించనున్నారు. రూ.3 వేలు నెల చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారు. ఇక డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1,500 ఇస్తారు.
– ఎస్సీలకు 15 శాతం నుంచి 17, ఎస్టీలకు 3 నుంచి 7 శాతం రిజర్వేషన్లు పెంపు, మైనారిటీ రిజర్వేషన్లు 4 శాతం పునరుద్ధరణ
– లింగాయత్ లు, ఒక్కలింగ, ఇతర వర్గాల రిజర్వేషన్లు పెంపు. 9వ షెడ్యూల్ లో చేర్చడం.
– మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి. రైతులకు పాల రాయితీ రూ.5 నుంచి రూ.7కి పెంపు
కాగా మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడంతో ఇక కర్ణాటకలో ప్రచారం మరింత ఊపందుకుంది. పార్టీ అగ్ర నాయకులు మొదలుకుని సామాన్య కార్యకర్తలు ఇంటింటి బాట పట్టారు. బీజేపీని ఓడించాలనే కసితో ప్రజలు ఉన్నారు.