ముకేష్ అంబానీ పరిచయం అక్కర్లేని పేరు. మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో ముకేష్ అంబానీ ఒకరు. ఆయన కుమార్తె ఇషా అంబానీ కూడా అందరకీ పరిచయమే. కాగా… ఆమె తాజాగా తన తల్లి నీతా అంబానీ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కళల రంగంలో మొట్టమొదటిసారిగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ని ప్రారంభిస్తున్నట్లు ఇషా ప్రకటించారు. తన తల్లి నీతా అంబానీకి ఇది అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించడం గమనార్హం.
నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం 2023, మార్చి 31న ప్రారంభించనున్నట్లు ఇషా అంబానీ స్పష్టం చేశారు. లాంఛ్‌ను పురస్కరించుకొని 3 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కళల రంగంలో ప్రముఖ కళాకారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు.. కల్చరల్ సెంటర్ ప్రారంభ వేడుక కన్నుల పండగగా జరగనున్నట్లు సమాచారం. మార్చి 31 నుంచే ఈ సాంస్కృతిక కేంద్రంలో ప్రవేశించేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.
నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ అనేది కేవలం ఒక స్పేస్ కాదని.. ఇది తన తల్లి నీతా అంబానీకి కళల పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనమని.. భారత్‌లో సాంస్కృతిక, సంప్రదాయాల కలయిక అని ఆమె అభివర్ణించారు. ఇలా విభిన్న కళాకారులు, ఆడియెన్స్, ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకురావాలని నీతా అంబానీ ఎప్పటినుంచో కలలుగన్నారని ఇషా చెప్పారు.