రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశంలో చలి వణికిస్తున్నా… ఆయన తన పాదయాత్రకు ఎలాంటి పులిస్టాప్ పెట్టలేదు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన కేవలం సాధారణ టీ షర్ట్ ధరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలు జనాలు.. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్వెట్ షర్ట్స్, స్వెట్టర్లు ధరిస్తుంటే.. ఆయన సాధారణ టీ షర్ట్ ధరించడం వెనక రహస్యాన్ని ఆయన సోదరి ప్రియాంక గాంధీ తెలియజేశారు.
తన అన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ చుట్టూ ‘సత్యం’ అనే కవచం ఉందని, అందువల్లనే ఆయనకు చలి వేయదని ప్రియాంక తెలిపారు. రాహుల్ చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్ర ‘భారత్ జోడో యాత్ర’ ను కీలకమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన సోదరుడు రాహుల్ సత్యం అనే కవచాన్ని ధరించాడని, అందుకే ఆయనకు చలి వేయదని వ్యాఖ్యానించారు. దాదాపు వారం రోజుల విరామం అనంతరం భారత్ జోడో యాత్ర మంగళవారం మళ్లీ ప్రారంభమైంది.