భారత పరిశోధన సంస్థ ఈ రోజు చేపట్టిన గగన్ యాన్ ప్రయోగంలో తొలుత టెక్నిల్ సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయోగాన్ని ఇస్రో (ISRO) కాసేపు వాయిదా వేసింది. ఆ తర్వాత సమస్యను వెంటనే పరిష్కరించి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. మరోవైపు ఏ టెక్నికల్ సమస్యలు తలెత్తాయో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. తొలుత టీవీ-డీ1 (TV-D1) ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ (S. Somnath) శాస్త్రవేత్తలను అభినందించారు. ‘‘టీవీ-డీ1 మిషన్ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. క్రూ మాడ్యూల్ (Crew module) సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది’’ అని సోమనాథ్ వెల్లడించారు.దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్(Rocket) నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు (Parachutes) విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.